తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు జడ్జీలు

-

తెలంగాణ హైకోర్టుకు మరో ఆరుగురు కొత్త న్యాయమూర్తులు రానున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం కొత్తగా మరో ఆరుగురి పేర్లను సిఫార్సు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలో సోమవారం సమావేశమైన కొలీజియం ఆరుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించాలని ప్రతిపాదిస్తూ కేంద్రానికి జాబితా పంపింది.

ఇందులో ఏనుగుల వెంకట వేణుగోపాల్‌, నగేష్‌ భీమపాక, పుల్లా కార్తీక్‌, కాజ శరత్‌, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావు ఉన్నారు. 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన ఈ హైకోర్టులో ప్రస్తుతం 27 మంది పనిచేస్తున్నారు. 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొలీజియం సిఫార్సు చేసిన ఈ ఆరుగురి నియామకానికి కేంద్రం ఆమోదముద్ర వేస్తే ఖాళీల సంఖ్య 9కి తగ్గుతుంది.

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌ (2), ఒడిశా (3), గువాహటి (2), కోల్‌కతా (9), పంజాబ్‌, హరియాణా (13) హైకోర్టులకు కలిపి మొత్తం 35 మంది పేర్లను కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈనెల 19వ తేదీన కర్ణాటక హైకోర్టు (5), అలహాబాద్‌ హైకోర్టు (9), 20న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు (7)కు చేసిన సిఫార్సులను కూడా కలిపితే గత అయిదురోజుల్లో 9 హైకోర్టులకు 56 పేర్లను సిఫార్సు చేసినట్లయింది.

Read more RELATED
Recommended to you

Latest news