టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు! ఆ ఆరుగురు ఎవరంటే?

-

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ మంగళవారం విడుదల కానున్నది. ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్‌ఎస్‌కు 103 మంది, మిత్రపక్షం ఎంఐఎంకు ఏడు ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 110 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన ఆరు ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్ ఖాతాలో పడటం ఖాయమే. ఎలాగో గెలుపు తథ్యం కావడంతో గులాబీ బాస్ కే చంద్రశేఖర్ రావు ఆరుగురు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం.

తెలంగాణ ఉద్యమం, రాజకీయ, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసినట్లు తెలుస్తున్నది. అసెంబ్లీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసుదనాచారికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాకుండా ఆయనకే మండలి చైర్మన్ పదవి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతున్నది. గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతున్నది.

గవర్నర్ కోటాలో నామినేట్ ఆమోద ముద్ర లభించని పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

టీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్‌రావు, ఎస్సీ సామాజిక వర్గం కోటాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు అవకాశం దక్కనున్నట్లు సమాచారం. 2009, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2015 వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లోనూ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం చివరి నమిషంలో కోల్పోయారు. ఈసారి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని పార్టీ నేతలు బలంగా కోరుతున్నట్లు తెలుస్తున్నది. ఎస్సీ కోటాలో మరొకరికి కూడా అవకాశం ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేరు దాదాపు ఖరారైనట్లేనని సమాచారం.

మరోవైపు నాగార్జున సాగర్ నియోజకవర్గ నేత ఎంసీ కోటిరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నది. బీసీ సామాజిక వర్గం నుంచి ఎల్.రమణ, కర్నాటి విద్యా సాగర్, పిట్టల రవీందర్ పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. చివరి నిమిషంలో ఏదైనా మార్పులు, చేర్పులు జరిగితే వీరిలో నుంచి ఎవరికైనా అవకాశం దక్కవచ్చు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఖరారైందనే సమాచారంతో ఆశావహులు చివరి ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. సీఎం ఓస్డీ దేశపతి శ్రీనివాస్, అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, మాదాటి రమేష్‌కుమార్‌రెడ్డి, రావుల శ్రవర్‌కుమార్‌రెడ్డి, రవీందర్‌సింగ్, సీతారాం నాయక్, పిడమర్తి రవి, మోత్కుపల్లి నర్సింహులు, శ్రీహరిరావు, పీఎల్ శ్రీనివాస్, తాడూరి శ్రీనివాస్, ఆకుల లలిత, ఫరీదుద్దీన్, బోడకుంటి వెంకటేశ్వర్లు, గ్యాధరి బాలమల్లు తదితరుల పేర్లు ఇప్పటికీ వినిపిస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version