గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై విధించిన సస్పెన్షన్‌ను బీజేపీ తొలగించకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. మరోవైపు తనపై విధించిన సస్పెన్షన్‌ను అధిష్ఠానం తొలగిస్తుందన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
సస్పెన్షన్ ఎత్తివేయకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటానని, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశం లేదని రాజా సింగ్ స్పష్టం చేశారు. మంగళవారం రోజున ఆయన పలు వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు తాను పెద్ద అభిమానినని, పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ సహా అందరి ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు.