పంచాయతీ ఎన్నికల్లో రోజా దూకుడు అందుకేనా

-

నగరి ఎమ్మెల్యే రోజా వరసగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. వైసీపీ అధికారంలోకి రావడంతో కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశపడ్డారు. సామాజిక సమీకరణలు కలిసిరాకపోవడంతో మంత్రి పదవికి దూరమైన రోజా తర్వాత కామ్‌ అయిపోయారు. అయితే పంచాయతీ ఎన్నికల సమయంలో మాత్రం గేరు మార్చి ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. కేబినెట్‌లో చోటు సంపాదించేందుకు ఇప్పుడు కొత్త మార్గం ఎంచుకున్నారట..మంత్రి పదవి దక్కాలంటే ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అని చెబుతున్నారట..

నగరిలో రోజాకు సొంత పార్టీ నేతలైన డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నది ఆమె అనుచరులు చెప్పేమాట. ఇలాంటి సమస్యలను కొంత వరకు సర్దుబాటు చేసింది వైసీపీ అధిష్ఠానం. ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉన్నా ఆ మేరకు గుర్తింపు లేదన్న ఆవేదనలో ఉన్నారట. పార్టీలో ఒంటరిని చేస్తున్నారనే బాధ కుంగదీస్తోందట. ఇదే సమయంలో శాసనసభ ప్రివిలేజ్‌ కమిటీ ఎదుట కన్నీళ్లు పెట్టుకోవడం ద్వారా తన పరిస్థితిపై పార్టీ అటెన్షన్‌ వచ్చేలా చేశారని ప్రచారం జరిగింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు రావడంతో నగరి పరిధిలో మెజారిటీ స్థానాల్లో వైసీపీ మద్దతుదారులను గెలిపించే పనిలో పడ్డారట.

నగరిలో పరిస్థితులు మాత్రం అనుకున్నంత సానుకూలంగా లేవట. ఒకవైపు టీడీపీని గ్రామస్థాయిలో ఎదుర్కోవాలి.. మరోవైపు తన చెక్‌ పెట్టాలని అనుకుంటున్న సొంత పార్టీ నేతలతోనూ పోరాడాలి. నగరి అసెంబ్లీ పరిధిలో 93 గ్రామ పంచాయతీలు ఉంటే..వాటిల్లో 16 ఏకగ్రీవాలయ్యాయి. టీడీపీని కట్టడి చేసి.. మెజారిటీ స్థానాలను వైసీపీ ఖాతాలో వేయాలన్న లక్ష్యంగా రోజా పావులు కదుపుతున్నారట. ఎక్కువ చోట్ల పార్టీ జెండాలు రెపరెపలాడిస్తే వైసీపీ పెద్దల దృష్టిలో పడొచ్చదని.. తద్వారా కేబినెట్‌లో చోటు ఖాయమవుతుందని ఆమె లెక్కలు వేసుకుంటున్నారట.

నగరిలో టీడీపీ బలపడితే భవిష్యత్‌లో తనకు రాజకీయంగా మంచిదికాదనే అభిప్రాయంలో రోజా ఉన్నారు. అలాగే వైసీపీలోని ప్రత్యర్థులకు ఛాన్స్‌ ఇస్తే మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారట. అందుకే పంచాయతీ ఎన్నికల్లో కాలికి బలపం కట్టుకుని వైసీపీ మద్దతుదారులను గెలిపించే పనిలో పడ్డారని పార్టీ కేడర్‌ భావిస్తోంది. అలాగే వైసీపీలో తనను రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నవారికి కూడా చెక్‌ పెట్టొచ్చని భావిస్తున్నట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో గెలుపుతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని దూకుడు పెంచారట ఈ ఫైర్ బ్రాండ్.

Read more RELATED
Recommended to you

Latest news