తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జర్గుతుహోంది. తెలంగాణలోని మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు ఏపీలో ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ కూడా 8 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది.
ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30,927 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీనికోసం నాలుగు జిల్లాల్లో 227 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2200 మంది సిబ్బందిని, 2400 మంది పోలీసులు భద్రత కోసం ఏర్పాటు చేశారు. ఇకపోతే, తెలంగాణ హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి బరిలో 93 మంది అభ్యర్థులు, నల్గొండ-వరంగల్-ఖమ్మం బరిలో 71 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దీంతో హైదరాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి ఎన్నికల మీద తీవ్ర ఆసక్తి నెలకొంది.