దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ వ్యవహారంపై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా పార్లమెంటు సమావేశాల్లో ఈ వ్యవహారంపై జరిగిన రసాభాసా అంతా ఇంతా కాదు. హిండెన్‌బర్గ్ నివేదిక బహిర్గతం అయినప్పటి నుంచి అదానీ ఆస్తులు కర్పూరంలాగా కరిగిపోతున్నాయి. నెల వ్యవధిలోనే లక్షల కోట్లు ఆవిరయ్యాయి.
తాజాగా అదానీ వ్యవహారంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. అదానీ కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన జీవిత బీమా సంస్థ డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ప్రజల డబ్బులతో ఆటలాడటం ఏంటని ధ్వజమెత్తారు. ఎల్ఐసీలో పెట్టుబడులు పెట్టిన మధ్య తరగతి ప్రజలకు మోదీ ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు.
అదానీ కంపెనీల్లో ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎల్ఐసీ పెట్టిన పెట్టుబడుల విలువ 11 శాతం మేర పడిపోవడం పట్ల కవిత తీవ్రంగా స్పందిస్తూ కేంద్రానికి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగి దాదాపు రూ.12 లక్షల కోట్లు నష్టపోయినా సీబీఐ, ఈడి, రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) వంటి సంస్థలు ఎందుకు మౌనంగా ఉంటున్నాయని ప్రశ్నించారు. ఆ సంస్థలను కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించుకుంటారా అని నిలదీశారు.
Value of LIC holding in #Adani drops 11% lower than purchase price. What does the Modi Govt have to say to the lakhs of middle class families invested in #LIC ? Why is #CBI #ED #RBI silent or are they meant only for political witch hunting. @BRSparty demands JPC on #AdaniScam https://t.co/4Lbdd9XhJ6
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 25, 2023