న్యూయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. అయితే.. న్యూయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. అయితే.. నూతన సంవత్సరం సందర్భంగా 31వ తేదీన అర్ధరాత్రి తర్వాత కూడా ఎంఎంటీఎస్ రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి, లింగంపల్లి నుంచి ఫలక్ నుమాకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ఇక, న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు హైదరాబాద్ మెట్రోరైలు అధికారులు ప్రకటించారు.. 31న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు తిరగనున్నాయి.. రాత్రి ఒకటి గంటకు మొదటి స్టేషన్ నుండి బయల్దేరనున్న చివరి మెట్రో రైలు.. రెండు గంటలకు గమ్యస్థానాలకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు అధికారులు.
ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండుగకు మరో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే… ఇప్పటికే సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది రైల్వేశాఖ.. అయినా, ప్రయాణికుల నుంచి డిమాండ్ కొనసాగుతూనే ఉంది. దీంతో, ప్రయాణికులకు మరికొంత ఉపశమనం కలిగించేలా.. మరో 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. జనవరి 1 నుంచి 20వ తేదీ మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లను వివిధ ప్రాంతాల మధ్య నడుపనున్నారు. గతంలో ప్రకటించిన రైళ్లకు ఈ సర్వీసులు అదనం.