ప్రధాని నరేంద్ర మోడీ.. హైదరాబాద్ పర్యటన ముగిసింది. ఆయన కొద్ది సేపటి క్రితం పూణె బయలుదేరి వెళ్లారు. కరోనా వ్యాక్సిన్ తయారీపై సమీక్షలు జరిపేందుకు మూడు నగరాల పర్యటనలో ఉన్న ప్రధాని. ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌కు వచ్చారు. నేరుగా జీనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్‌కు వెళ్లారు. అక్కడ కరోనా వ్యాక్సిన్ పురోగతిపై.. నిపుణులతో చర్చించారు.
వ్యాక్సిన్ తయారీ ఎంతవరకూ వచ్చిందనే విషయాన్ని ఆరా తీశారు. దాదాపు గంట పాటు ఆయన నిపుణులతో భేటీ అయ్యారు. భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలతో కోవాగ్జిన్ టీకా అభివృద్ధిపై చర్చించారు ప్రధాని మోడీ. వ్యాక్సిన్ ట్రయల్స్‌లో పురోగతి వివరాలను ప్రధాని మోడీకి వివరించారు శాస్త్రవేత్తలు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల కృషిని అభినందించారు మోడీ. ఐసీఎంఆర్‌తో కలిసి మరింత వేగంగా వ్యాక్సిన్ తయారీకి కృషిచేయాలని సూచించారు. అనంతరం ఆయన భారత్ బయోటెక్ సంస్థను అభినందించారు.