తెలంగాణ గ్రానైట్‌తో దిల్లీలో 28 అడుగుల నేతాజీ విగ్రహం

-

తెలంగాణ గ్రానైట్‌తో తయారు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం హస్తినలో మెరవనుంది. ఖమ్మం జిల్లా గ్రానైట్‌తో 28 అడుగుల నేతాజీ విగ్రహాన్ని తయారు చేశారు. దేశరాజధాని దిల్లీ నడిబొడ్డున ఠీవీగా నిలబడిన ఈ విగ్రహాన్ని ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు. ఇప్పటికే నేషనల్‌ పోలీస్‌ మెమోరియల్‌, మాజీ ప్రధాని వాజ్‌పేయీ సమాధిపై నిక్షిప్తమైన ఖమ్మం గ్రానైట్‌ ఇప్పుడు దేశరాజధానిలో మరోసారి తళుక్కుమననుంది.

భారత స్వాతంత్య్రసంగ్రామంలో అద్వితీయపాత్ర పోషించిన ఈ మహనీయుడి సేవలను తరతరాలకూ చాటిచెప్పేందుకు ఇండియాగేట్‌ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఇందుకోసం 1,665 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా నుంచి 140 చక్రాలుగల 100 అడుగుల లారీలో 280 మెట్రిక్‌ టన్నుల ఏకశిల గ్రానైట్‌ రాయిని దిల్లీకి తెప్పించారు. సుమారు 26వేల గంటలు శ్రమించి కళాకారులు 65 మెట్రిక్‌ టన్నుల బరువున్న 28 అడుగుల విగ్రహానికి ప్రాణం పోశారు.

కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత యువ కళాకారుడు అరుణ్‌ యోగిరాజ్‌ ఆధ్వర్యంలో ఆధునిక పరికరాలు ఉపయోగించి పూర్తి భారతీయ సంప్రదాయపద్ధతిలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఇది దేశంలోని ఎత్తైన ఏకశిలా విగ్రహాల్లో ఒకటి. విగ్రహా ఆవిష్కరణ సందర్భంగా మణిపురి శంఖ వాద్యం, కేరళ సంప్రదాయ పంచ వాద్యం, చండ మోగిస్తారు. ఏక్‌భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌ స్ఫూర్తితో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మంది కళాకారులతో కర్తవ్యపథ్‌లో నృత్యరూపకాలు ప్రదర్శిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news