వరంగల్‌ ఎంజీఎంలో మళ్లీ ఎలుకల కలకలం.. ఆందోళనలో రోగులు

-

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో కొద్దిరోజుల క్రితం ఎలుకల వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినా అక్కడి సిబ్బంది తీరు మారలేదు. ఆస్పత్రిలో మళ్లీ ఎలుకల సంచారం కలకలం రేపుతోంది. ఎలుకల వల్ల రోగులు, వారితో పాటు వచ్చిన సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇటీవల కలుషిత ఆహారం తిని కొంత మంది విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. వారిని పరామర్శించేందుకు స్థానిక బీజేపీ నాయకులు ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ ఎలుకలు సంచరిస్తున్న విషయాన్ని గమనించారు. గతంలో ఎలుక కొరకడం వల్ల ఓ వ్యక్తి మరణించినా ఆస్పత్రి అధికారులు వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రోగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఆస్పత్రి నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

‘బంగారు తెలంగాణలో రాష్ట్ర సర్కార్ పేద, మధ్యతరగతి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. విద్యార్థులకు ఏదైనా హాని జరిగితే చూస్తూ ఊరుకోం. వారికేం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి.’ అని ఏనుగు రాకేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news