దేశంలో గతేడాది నమోదైన మొత్తం ఆత్మహత్యల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గత సంవత్సరం లక్షా 64వేల మంది బలవంతంగా ప్రాణాలు తీసుకోగా అందులో 22వేలు మహారాష్ట్రలోనే ఉన్నాయి. తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2021లో దేశంలో చోటుచేసుకున్న మొత్తం బలవన్మరణాల్లో యాభై శాతానికి పైగా ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక వెల్లడించింది.
2021 ఏడాదిలో దేశవ్యాప్తంగా 1,64,033 ఆత్మహత్యలు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 7.2శాతం పెరిగాయి. మొత్తం కేసుల్లో అత్యధికంగా 22,207 ఆత్మహత్యలు మహారాష్ట్రలోనే (13.5శాతం) చోటుచేసుకున్నాయి. తమిళనాడులో 18,925 (11.5శాతం), మధ్యప్రదేశ్‌లో 14,,965 (9.1శాతం), పశ్చిమబెంగాల్‌లో 13,500 (8.2శాతం), కర్ణాటకలో 13,056 (8.1శాతం) బలవన్మరణాలు సంభవించాయి.
దేశంలో ఆ ఏడాది నమోదైన ఆత్మహత్యల్లో ఈ ఐదు రాష్ట్రాల్లోనివే 50.4శాతంగా ఉన్నాయి. మిగతా 49.5శాతం ఆత్మహత్యలు మిగిలిన 23రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి.