కాంగ్రెస్ ఇంచార్జ్ తో ఆ ఎంపీకి పూర్తిగా చెడినట్టుందే

-

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇన్నాళ్లూ జిల్లాల నాయకులు..రాష్ట్ర నేతల మధ్య విభేదాలు ఉండేవి..కానీ ఇప్పుడు సీన్ రివర్సయింది. పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ తో ఫైట్ చేస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు సీనియర్లు. ఇప్పటికే రాష్ట్రంలోని ముఖ్య నాయకులకు ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్‌కి మధ్య సమస్య నడుస్తుండగా ఓ సీనియర్ ఎంపీ ఇంచార్జ్ పై యుద్దమే ప్రకటించాడట..కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ ఆసక్తికర పరిణామాల పై గాంధీభవన్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుందట..

పీసీసీకి కొత్త చీఫ్‌ ఎంపిక తెచ్చిన తంటాతో ఠాగూర్‌కు, నాయకుల మధ్య పంచాయితీ మొదలైంది. ఈ విషయంలో మొదటి నుంచీ పార్టీ నాయకులు ఆయన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. అప్పుడప్పుడు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్‌ రేసులో ఉన్న కొందరు కోపాన్ని కూడా పెంచుకున్నారట. పీసీసీ రేసులో చివర వరకు ఉన్నా ఎంపీ ఇప్పుడు ఠాగూర్ పేరు చెబితేనే భగ్గుమటున్నాడట..

ఇటీవల రెండు రోజుల పర్యటన కోసం మాణిక్యం ఠాగూర్‌ హైదరాబాద్‌ వచ్చి వెళ్లారు. పార్టీ ముఖ్య నాయకులతోపాటు.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలోని నేతలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులతోనూ మాట్లాడారు ఠాగూర్‌. ఈ సమావేశాలకు నల్లగొండ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకుడు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డుమ్మా కొట్టారు. పైగా ఆయన పెట్టే ఏమీటింగ్ లు సమావేశాలకు రానని టచ్ లోకి వెళ్లిన నాయకులతో తెగేసి చెప్పారట..

నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ జిల్లా కీలకం. అలాంటి జిల్లాకు చెందిన ఎంపీ రాకపోవడంతో పార్టీలో కలకలం రేగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే రెండు పర్యాయలుగా పీసీసీ చీఫ్ రేసులో ఉంటూ వచ్చారు. గతంలో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తు చేస్తుంటారు. పార్టీ అధినేత సోనియగాంధీకి కూడా ఇదే విషయం చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

ఇటీవల పీసీసీ చీఫ్‌ ఎంపిక కోసం ఇంఛార్జ్‌ ఠాగూర్‌ చేపట్టిన అభిప్రాయ సేకరణ వన్‌సైడ్‌ జరిగిందన్నది కోమటిరెడ్డి ఆరోపణ. పీసీసీ చీఫ్ రేసులో ఉన్న వారి పేర్ల జాబితాను సోనియాగాంధీకి పంపినప్పుడు… దాంట్లో తన పేరు ఉద్దేశపూర్వకంగానే ప్రస్తావించలేదన్న కోపంలో ఉన్నారట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయన సోదరుడు, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇంఛార్జి వ్యవహార శైలితో నిరసన బాట పట్టారు. పీసీసీ చీఫ్ ఎంపిక జరిగేలోపు ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news