తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేస్తూ ఈమధ్యనే ఉత్తర్వులు జారీ చేసింది. అత్యవసర పనులపై బయటకెళ్తున్నవారందరూ విధిగా మాస్క్ ధరించాల్సిందేనని స్పష్టం చేసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా పోరులో అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. రోజూ ఎన్నోకొన్ని కేసులు పెరుగుతున్నా, నిబ్బరంగా ఉండి, అధికారులకు, మంత్రులకు అవసరమైన సలహాలు, సూచనలిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. కేసులన్న ప్రాంతాలను కంటెయిన్‌మెంట్ జోన్లుగా ప్రకటించి రాకపోకలను పూర్తిగా నిషేధించారు.
కరోనా పాజిటివ్ కేసులు ఇంకా బయటపడుతున్నందున, ప్రజలందరూ మాస్కులు ధరించాలనే నిబంధన విధించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ దిశగా పోలీసులు ముమ్మరంగా ప్రచారం చేస్తూ, మాస్క్ లేకుండా బయటికి వచ్చినవారిని హెచ్చరిస్తున్నారు. ప్రజలకు మాస్కులు ధరించేవిధంగా సందేశం ఇవ్వాలనుకున్న ముఖ్యమంత్రి తాను స్వయంగా మాస్క్ ధరించారు.
అలాగే, ఎంపీ సంతోష్‌కుమార్. ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా, వివిధ సామాజిక కార్యక్రమాలపై ప్రజలను ప్రోత్సహిస్తూంటారు. తాను చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ ను సోషల్ మీడియా ద్వారానే పాపులర్ చేసారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా పాటించాల్సిన నిబంధనలను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా వినూత్నంగా ప్రచారం చేస్తూ, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. వలస కార్మికులకు వీలైన చోటల్లా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆనాథ శరణాలయాలకు నిత్యావసరాలు పంపిణీ చేయడం, సినీ కార్మికులకు చేయూతనివ్వడం లాంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి.
ఎంపీ సంతోష్ కూడా ముఖ్యమంత్రి లాగే, తానూ మాస్క్ ధరిస్తూ, అందరినీ ధరించాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లాగే ఇది కూడా విజయవంతం కావాలని, ప్రజలందరూ కరోనా మహమ్మారి బారినుండి రక్షింపబడాలని ఆయన ఆకాంక్షించారు.