ది బెస్ట్‌ ఫినిషర్‌..ధోనీకి ఏమైంది…?

-

మహేంద్ర సింగ్‌ ధోనీ..భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన కెప్టెన్‌. టీ20 వరల్డ్‌ కప్‌, వన్డే వరల్డ్‌కప్‌లు అందించాడు. అలాగే చెన్నై సూపర్‌ కింగ్స్‌ను మూడుసార్లు ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలబెట్టాడు. క్రీజ్‌లో అతను ఉన్నాడంటే.. గెలుపుపై ఒక ధీమా. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు ధోనీలో ఆ కసి కనిపించడం లేదా ? చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుస ఓటములకు కారణం ఏంటి ? 39ఏళ్ల ధోనీకి వయసు సహకరించడంలేదా ? అసలు ధోనీకి ఏమైంది ?

రిటైర్మంట్‌ ప్రకటించిన తర్వాత ఐపీఎల్లో ఆడుతుండటంతో.. అందరి దృష్టి ధోనీపైనే ఉంది. అతని ఆటతీరును ఆస్వాదించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు ధోనీ ఆటతీరు మాత్రం అభిమానుల్ని సంతృప్తిపరచలేకపోయింది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో డకౌట్‌ అయిన ధోనీ.. ఆ తర్వాత కొద్దో, గొప్పో పరుగులు సాధిస్తున్నా.. జట్టును మాత్రం గెలిపించలేకపోతున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడో ఓవర్లోనే క్రీజ్‌లోకి వచ్చిన ధోనీ.. చివరివరకు నాటౌట్‌గానే ఉన్నాడు. అయినా జట్టును గెలిపించలేకపోయాడు. భారీషాట్లను అలవోకగా ఆడే జార్ఖండ్‌ డైనమేట్.. ఇప్పుడు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడుతున్నాడు.

దాదాపు ఏడాదిగా క్రికెట్‌కు దూరమవడంతో.. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేక ధోనీ సరిగా ఆడలేకపోతున్నాడని అనుకున్నారు. అయితే ఐపీఎల్లో నాలుగు మ్యాచ్‌ల తర్వాత కూడా ధోనీ.. తన మార్క్‌ ఆటతీరును అందుకోలేకపోతున్నాడు. గతంలో చివరివరకూ అతను క్రీజ్‌లో ఉంటే చాలు.. గెలుపు తానంతట అది వచ్చేస్తుందనే భరోసా ఉండేది. ఇప్పుడు ధోనీ చివరి వరకు నాటౌట్‌గా ఉంటున్నాడు కానీ.. సాధించాల్సిన రన్‌రేట్‌ను మాత్రం చేరుకోలేకపోతున్నాడు. ఏదో నామ్‌ కే వాస్తేగా.. జట్టు ఓటమి ఖరారయ్యాక.. బాదేస్తున్నాడు. సునాయాసంగా హెలికాఫ్టర్‌ షాట్స్‌ కొట్టే ధోనీ.. ఇప్పుడు సిక్సులు కొట్టడానికి ఆపసోపాలు పడుతున్నాడు.

ఇక కెప్టెన్సీపరంగా కూడా ధోనీ తీసుకుంటున్న నిర్ణయాలు కలిసిరావడంలేదు. బ్యాటింగ్‌ ఆర్డర్లో మార్పులు, టీమ్‌ను యాక్టివ్‌గా ఉంచడంలో ధోనీ విఫలమవుతున్నాడనే విమర్శలూ వినిపిస్తున్నాయి. మొన్నటివరకు రాయుడు వస్తే తమ కష్టాలు తీరిపోతాయని అనుకున్నాడు. ఇప్పుడు రాయుడు, బ్రావో వచ్చినా.. చెన్నై సూపర్ కింగ్స్‌ రాతమారలేదు. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు వచ్చినా అవే ఫలితాలు వస్తున్నాయ్‌. పాయింట్స్‌ టేబుల్లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరో స్థానంలో నిలిచింది.

మరి, ఇక ముందైనా ధోనీ.. తన ఫామ్‌ను తిరిగి అందుకుంటాడా ? విమర్శలకు తన బ్యాట్‌తో సమాధానం చెబుతాడా చూడాలి ధోనీ ఆట చూస్తుంటే అతడికి ఇదే లాస్ట్‌ ఐపీఎల్‌ అన్పిస్తోంది. ఇక ధోనీనీ నెక్ట్స్‌ సీజన్‌లో చూడటం కష్టమంటున్నారు క్రీడా నిపుణులు.

Read more RELATED
Recommended to you

Latest news