మునుగోడులో కారు డబుల్ స్పీడ్ తో గులాబీ జెండాను ఎగురవేడయం ఖాయమని రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నిక పూర్తయ్యే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని నేతలకు సూచించారు. మునుగోడు ఉప ఎన్నికకు భారీగా గులాబీ సైన్యం మోహరించేలా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. నియోజకవర్గాన్ని 86 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్‌కు ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా వ్యవహరించనున్నారు.
కేటీఆర్, హరీశ్‌రావు సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ బాధ్యతలు కేటాయించారు సీఎం కేసీఆర్. ఎల్లుండి పూర్తిస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. త్వరలో మరో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్రణాళిక చేస్తున్నారు. సీపీఐ, సీపీఎంలతో సమన్వయం చేసుకుంటూ వామపక్షాల ఓట్లన్నీ కచ్చితంగా తెరాసకు పడేలా వ్యూహాలు చేస్తున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరు దాదాపు ఖరారయింది. రేపు దసరా రోజున సీఎం కేసీఆర్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనున్నారు. కర్నె ప్రభాకర్, బూర నర్సయ్య తదితరులు కూడా ఆశించినప్పటికీ.. కూసుకుంట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. అధిష్ఠానం సూచనల మేరకు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.