టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని జనసేన నేత నాగబాబు అన్నారు. ఆయన తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… టీడీపీ అధినేత అరెస్ట్ తనకు బాధ కలిగించిందన్నారు. ఆయన అరెస్ట్ పైన జనసైనికులు కూడా ఆవేదనగా ఉన్నారన్నారు. టీడీపీ, జనసేన పొత్తును జనసైనికులు స్వాగతిస్తున్నారని తెలిపారు. అయితే ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది మాత్రం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని నాగబాబు అన్నారు. టీడీపీతో పొత్తు ఉంటుందని, అదే సమయంలో బీజేపీతో పొత్తుపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. కోట్లాది రూపాయల ఆస్తులున్న నేతలు జనసేనకు అవసరం లేదని, ప్రజాసేవకులు తమకు ముఖ్యమన్నారు. అవినీతిపరులు, అక్రమార్కులకు జనసేనలో సీట్లు ఇచ్చేది లేదన్నారు.
సాక్షిలో రాసిన వార్తపై జనసేన నేత నాగబాబు ఫైర్ అయ్యారు. “జనసేన కింద టీడీపీ పని చేస్తుందని మీ పేపర్లో రాస్తారా?. మీకు సమాధానం చెప్పటం కూడా వృధా అని నాగబాబు సాక్షి విలేకరితో చెప్పారు. జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా తిరుపతిలో ఎవరు పోటీ చేయాలో సాక్షి పత్రిక వాళ్లే నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రజల కర్మ మూడు, నాలుగు నెలల్లో తీరిపోతుంది. ఒకరు దెబ్బతిన్నపుడు తొక్కేసి పైకి రావాలని, పుంజుకోవాలనే అవకాశ రాజకీయాలు, నీచమైన రాజకీయాలు జనసేన చేయదు. చంద్రబాబును కారణం లేకుండా జైళ్లో పెట్టారు. టీడీపీకి, చంద్రబాబుకు సపోర్టుగా మేము మీకు ఉన్నాం. ఆయనపైన కేసులు పడ్డాయి అని చంకలు గుద్దుకునే పరిస్థితి మాకు లేదు అని విరుచుకుపడ్డారు.