ఇండియాలో తెలంగాణ లేదా ? మా రైతులు భారత దేశ రైతులు కాదా..? : నామా

భారత్ లో తెలంగాణ లేదా….!? తెలంగాణ రైతులు భారత దేశ రైతులు కాదా..!? అని.. టిఆర్ఎస్ లోకసభ పక్ష నేత నామా నాగేశ్వరరావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని క్షమించ‌బోర‌ని.. ధాన్యం కొనుగోళ్లపై ఒకటి, రెండు రోజుల్లో కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులను కేంద్రం అవమానిస్తుందని.. రైతులతో రాజకీయం చేస్తున్నారని కేంద్ర నేత‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

“ఆహార బద్రత చట్టం” కింద దేశంలో ధాన్యం సేకరించడం కేంద్రం భాద్యత అని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్ల అంశానికి సంభందించి తొమ్మిది రోజులు పార్లమెంట్ లో ఆందోళన చేశామ‌ని చెప్పారు నామా. కేంద్రం పట్టించుకోకపోవడంతో పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించామ‌ని స్ప‌ష్టం చేశారు. బిజెపి ఎంపీలు రైతుల గురించి కనీసం ఒక్క మాట మాట్లాడలేదని ఫైర్ అయ్యారు నామా.  తెలంగాణలో ఎఫ్ సీఐ గోదాంలు నిండిపోయామని.. వాటిని తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యాన్ని పంపించలేదనే కేంద్రం వాదన సరికాదని ఆయన అన్నారు.