పిచ్చి జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరస్థాయికి చేరిందని, గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకుని, కేంద్రానికి నివేదిక పంపాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రోజుకో తప్పుడు కేసు పెడుతోన్న సిఎం జగన్ కి పిచ్చి బాగా ముదిరిపోయిందని జనం చర్చించుకుంటున్నారని తెలిపారు. కక్షతో రగిలిపోతున్న జగన్ నైజం ఏంటో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్థం అయ్యిందన్నారు. సీఎం స్థానంలో ఉండి ఉన్మాదిలా మారి, సిఐడిని వైసీపీ అనుంబంధ విభాగంగా మార్చుకుని..ప్రతిపక్ష నేతమీద కేసుల మీద కేసుల పెట్టడం దేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. ప్రతిపక్షాన్ని వేధించేందుకు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదన్నారు. చంద్రబాబుపై ఆధారాల్లేని తప్పుడు కేసులు వరసగా బనాయించడం చూసిన జనం, సిఎం జగన్ కు పిచ్చి బాగా ముదిరిపోయిందని అనుకుంటున్నారని పేర్కొన్నారు.
జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వెంటనే వైద్యపరీక్షలు జరపాలని కోరారు. ఈ విషయంలో గవర్నర్ గారు తక్షణమే జోక్యం చేసుకోకపోతే, ఈ పిచ్చి సీఎం తీసుకునే దారుణమైన నిర్ణయాలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని, తన పిచ్చితో రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకుంటోన్న జగన్ దారుణ పరిస్థితిపై కేంద్రానికి అర్జంటుగా గవర్నర్ గారు నివేదికలు పంపాల్సిన అవసరం ఉందన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో రూపాయి అవినీతి జరగకపోయినా కేసు బనాయించారని, ఈ రోజుకీ ఒక్క ఆధారమూ లేదని, వేయని రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చారని మరో కేసు, ఉచితంగా ఇసుక ఇస్తే అందులో స్కాం అంటూ ఇప్పుడు ఇంకో కేసు, దేశంలోనే పేరుప్రఖ్యాతులు సంపాదించిన ఫైబర్ నెట్ ప్రాజెక్టుపై మరో కేసు, తాను జె బ్రాండ్స్ అమ్ముతూ చంద్రబాబుపై లిక్కర్ స్కాం కేసు పెట్టిన జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే జాలేయడంతోపాటు ఆందోళన కలిగిస్తోందన్నారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కక్షలు, రాజకీయ వేధింపులు, అస్థిరత్వం, విధ్వంసం వైపు తీసుకెళ్లిన పిచ్చి జగన్ కి అర్జంటుగా పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలన్నారు. ప్రతి పక్ష నేతపై రోజుకో తప్పుడు కేసు పెట్టడమే తన లక్ష్యం అన్నట్లు సిఎం జగన్ వ్యవహరించడం దుర్మార్గమైన పాలనకి నిదర్శనమన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తాను రాష్ట్రానికి ఏం చేశానో చెప్పుకోలేక..ఇలా దొంగ కేసులతో ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న జగన్ పిచ్చి పీక్స్ కి చేరిందని దుయ్యబట్టారు. దేశంలోనే అతి ఎక్కువ కేసులు, లెక్కలేనన్ని ఆస్తులతో కరప్ట్ పొలిటీషియన్ గా ముద్రపడిన జగన్…. ఆ బురదను చంద్రబాబుకూ అంటించాలని చూస్తుండడం దారుణమన్నారు. చంద్రబాబుపైనా, టిడిపి నేతలపైనా పెట్టిన ఏ ఒక్క కేసూ న్యాయ స్థానాలలో నిలబడవని, బాబుపై జగన్ గ్యాంగ్ చేస్తున్న తప్పుడు ఆరోపణలలో ఏ ఒక్కటీ ప్రజలు నమ్మడంలేదని లోకేష్ పేర్కొన్నారు. ఇదంతా చూసి జగన్ మరింత పిచ్చిపట్టినట్టు ప్రవర్తిస్తున్నాడని, ఈ స్థాయిలో పిచ్చి వున్నవారు సీఎం పదవిలో కొనసాగడానికి అనర్హులని, గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.