తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏడవ రోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరులో విజయవంతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రజల భవిష్యత్తు మారాలంటే సైకో పోవాలి – సైకిల్ రావాలని అన్నారు. పలమనేరులో పులి అమర్నాథ్ రెడ్డి ని గెలిపించుకోవాలంటూ వ్యాఖ్యానించారు. పలమనేరు అభివృద్ధి కోసం అమర్నాథ్ రెడ్డి 650 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు.
జగన్ రెడ్డి దళిత ద్రోహి అని ఫైర్ అయ్యారు నారా లోకేష్. ఎస్సీ, ఎస్టీల పైన అట్రాసిటీ కేసులు పెడుతున్నారని, ఎస్సీ, ఎస్టీల ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతీయడమే కాకుండా.. ఈ ప్రభుత్వం దళితులను చంపేసి మృతదేహాలను ఇంటికి పంపుతుందని ఆరోపించారు. దళితుడైన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి వెదురుకుప్పం మండలం మారేపల్లి ఎస్సీ కాలనీలో బుధవారం పర్యటించి వెళ్ళగానే ఎస్సీ మహిళా మారెమ్మ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు అంటే ఈ రాష్ట్రంలో వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.