బ్రేకింగ్‌ : నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. ఏం జ‌రిగిందంటే..?

టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ డ్రోన్ కెమెరా విద్యుత్ వైర్లకు తగిలి లోకేష్ ముందు పడిపోయింది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఈ ఉదయం పోలీసులు ప్రయోగించగా, అదుపు తప్పిన ఓ డ్రోన్, తెలుగుదేశం పార్టీ నేతల ముందు పడింది. ఈ ఘటనలో టీడీపీ నేత నారా లోకేశ్ సహా, దీపక్ రెడ్డిలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంగళగిరి నుంచి అమరావతి వరకూ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించి వచ్చిన వారు, బస్సు దిగి, ఫైర్ స్టేషన్ సమీపంలో చంద్రబాబు చేస్తున్న దీక్ష వద్దకు కాలినడకన బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది.

టీడీపీ ధర్నాను చిత్రీకరించేందుకు పోలీసులు కెమెరాను అమర్చిన డ్రోన్ ను ప్రయోగించారు. అది అదుపు తప్పి కుప్పకూలింది. టీడీపీ నేతలకు అత్యంత సమీపంలో పెద్ద శబ్దం చేస్తూ, ఇది పడటంతో కొంత కలకలం రేగింది. ఏం జరిగిందో కాసేపు అర్థం కాలేదు. ఆపై టీడీపీ నేతలు అక్కడి నుంచి నిరసన జరుగుతున్న ప్రాంతానికి వెళ్లిపోయారు.