టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్కూళ్ల విలీనంపై స్పందించారు. టీచర్లపై కక్ష.. విద్యార్థులకి శిక్ష అన్నట్టుగా ఏపీలో విద్యా వ్యవస్థ ఉందని.. 117, 128, 84, 85 జీవోలతో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందని పేర్కొన్నారు. గందరగోళంలో ఉపాధ్యాయులున్నారు.. ఆందోళనలో విద్యార్థులున్నారని.. ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎదురు దాడికి దిగుతోందని వెల్లడించారు.
విద్యావ్యవస్థకి శాపంగా మారిన జీవోలను ఇప్పటికైనా రద్దు చేయాలని.. జాతీయ విద్యా విధానం అమలు పేరుతో ప్రభుత్వం దారుణాలు చేస్తోందని మండిపడ్డారు. మూడేళ్ల వైసీపీ సర్కారు అనాలోచిత, మూర్ఖపు నిర్ణయాల వల్ల విద్యా రంగం పూర్తిగా భ్రష్టు పట్టిందని.. పాఠశాలల విలీనంతో నిరుపేద పిల్లలు విద్యకి పూర్తిగా దూరమై బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉందని వెల్లడించారు.
ఊర్లో, ఇంటి పక్కనే ఉన్న బడిని 3 కిలోమీటర్ల మేర దూరం చేశారని.. తల్లిదండ్రులు కూలి పనులకి వెళ్లిపోతే ఇంటి నుంచి వాగులు, వంకలు, రోడ్లు దాటుకుని ఏ పిల్లాడు బడికి వెళ్తాడు..? అని నిలదీశారు లోకేష్. సీపీఎస్ రద్దు, తమకు రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాడిన ఉపాధ్యాయులపై సీఎం జగన్ కక్ష సాధించారు… నూతన విద్యా విధానాన్ని జగన్‌రెడ్డి సర్కారు ఒక ఆయుధంగా వాడుతోందని మండిపడ్డారు.