నారా లోకేష్…తెలుగుదేశం ఫ్యూచర్ లీడర్…అని ఆ పార్టీ కేడర్ భావిస్తుంటుంది. కానీ జనం మాత్రం లోకేష్‌ని ఇంకా నాయకుడుగా చూస్తున్నట్లు కనిపించడం లేదు. అందుకే చినబాబు ఏం చెప్పినా జనాలకు రీచ్ అవ్వడం లేదు. అసలు టీడీపీకి ఫ్యూచర్ లీడర్‌గా అనుకుంటున్న లోకేష్…అందుకు తగ్గట్టుగా రాజకీయం చేస్తున్నట్లే కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి చంద్రబాబు, చినబాబులు ఎక్కువగా హైదరాబాద్‌కే పరిమితవుతున్నారు. చివరకు జనాల్లోకి రాకుండా ఇంకా ట్విట్టర్ పిట్ట అన్న ముద్ర కూడా చేరిపేసుకోలేదు.
కరోనా వచ్చిన దగ్గర నుంచి వీరు ఏపీ మొహం చూసింది చాలా తక్కువ. ఏదో అప్పుడప్పుడు అతిథిలు మాదిరిగా ఏపీకి వచ్చి వెళ్ళిపోయారు. చంద్రబాబుకు కాస్త పెద్ద వయసు కాబట్టి, ఇంటి దగ్గర ఉన్నారని అనుకోవచ్చు, కానీ యువకుడుగా ఉన్న లోకేష్‌కు ఏమైందని సొంత పార్టీ కార్యకర్తల నుంచే విమర్శలు వస్తున్నాయి. భావి టీడీపీ అధినాయకుడుగా లోకేష్ చేసే రాజకీయం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. పైగా చినబాబు ఎంతసేపు సోషల్ మీడియాలోనే హడావిడి చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తప్పులని ఎత్తి చూపిస్తున్నారు. వైసీపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు.
చినబాబు సోషల్ మీడియాలో చేసే రాజకీయం బాగానే ఉంది. కాకపోతే ఆయన ఏం చెబుతున్నారనేది మాత్రం సామాన్య ప్రజలకు తెలియడం లేదు. సోషల్ మీడియాలో ప్రశ్నించడం వల్ల, జగన్ ప్రభుత్వం చేసే తప్పులు ప్రజలకు ఎక్కడ వెళ్తాయనేది తమ్ముళ్ళు ఆవేదన. సరే ప్రత్యర్ధి పార్టీ గురించి వదిలేస్తే సొంత పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం ఒక్కటి చేయడం లేదని తెలుస్తోంది. ఏపీలో చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకత్వం లేదు. అలాంటి చోట్ల కొత్త నాయకత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.
ఇటు కింది స్థాయిలో కార్యకర్తలే వైసీపీ మీద పోరాటం చేస్తూ, కేసులు పెట్టించుకుంటున్నారు. వారికి పెద్దగా అండగా ఉండే కార్యక్రమం చేయడంలేదు. ఎంతసేపు సోషల్ మీడియా ఖండనలు చేస్తున్నారుగానీ, వాటి వల్ల ఎవరికి ఉపయోగం లేదు. అసలు చినబాబు సోషల్ మీడియాలో రాజకీయం చేయడం వల్ల ప్రజలకు ప్రభుత్వం చేసే తప్పులు పెద్దగా తెలియడం లేదు. అలాగే సంక్షేమ పథకాల వల్ల ఇంకా జనాలకు జగనే కనబడుతున్నారు.
-vuyyuru subhash