‘ఏ1 తెచ్చినా.. జీవో1తో వచ్చినా? పవన్ కల్యాణ్ వారాహి ఆగదు-యువగళం పాదయాత్ర ఆగదు’ అంటూ వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తన పాదయాత్రలో పార్టీ కార్యకర్తలు.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తనకంటే ఉత్సాహంగా కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని యువగళం పాదయాత్రలో లోకేశ్ కార్యకర్తలను అభినందించారు.
యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీ ప్లెక్సీలను ధ్వంసం చేస్తున్నారని లోకేశ్ అన్నారు. ఆరో రోజు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని కమ్మనపల్లె విడిది కేంద్రం నుంచి లోకేశ్ పాదయాత్రను ప్రారంభించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. గొల్లపల్లికు చేరుకుని.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
వైఎస్సార్సీపీ నాయకులకు టీడీపీ ఫ్లెక్సీలు చూస్తే ఎందుకంత భయమని లోకేశ్ ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డికి పసుపు రంగు అన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా భయం పట్టుకుందని లోకేశ్ ఎద్దేవా చేశారు. మా సహనాన్ని పరీక్షించొద్దని మరోసారి గట్టిగా హెచ్చరించారు.