హైదరాబాద్: ప్రకాశ్ రాజ్ తనకు మంచి మిత్రుడని ‘మా’ అధ్యక్షుడు నరేశ్ అన్నారు. ‘మా’ ఎన్నికలు (MAA Elections) జరగనున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ తనకు మూడు నెలల ముందు ఫోన్ చేశాడని చెప్పారు. మంచు విష్ణు కూడా పోటీ చేస్తున్నారన్నారు. ఎవరైనా పోటీ చేయొచ్చని విష్ణుకు కూడా చెప్పానన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది సభ్యులు నిర్ణయిస్తారని తెలిపారు. ‘మా’ సంస్థ మసకబారిపోయిందని అని నాగబాబు అనడం తప్పని, ఆ మాటలు ఆవేదన కలిగించాయన్నారు.
‘మా‘ సంస్థను కించపర్చడం తగదని నరేశ్ సూచించారు. ‘మా’ గురించి మాట్లాడేవారు గతంలో ఓటేశారా అని ప్రశ్నించారు. సభ్యులెవరైనా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయొచ్చన్నారు. తాము చేసిన కార్యక్రమాలన్నీ చిరంజీవి, నాగబాబుకు చెప్పామన్నారు. ప్రకాశ్ రాజ్ లోకలా?. నాన్ లోకలా అనేది తాము మాట్లాడమన్నారు. ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నామని తెలిపారు.
‘మా’ అనేది రాజకీయ వ్యవస్థ కాదని నరేశ్ వ్యాఖ్యానించారు. ఎంతో మంది పెద్దలు వేసిన బాట ‘మా’ అని తెలిపారు.‘మా’లో తన పయనం ఆరేళ్లు అని చెప్పారు. జీవితంలో మా అధ్యక్షుడివి కాలేరని తనను అన్నారని ఈ సందర్బంగా నరేశ్ తెలిపారు. ఒక మార్పు తీసుకురాలిని తాను పోటీ చేసినట్లు చెప్పారు. తన గురించి తాను చెప్పుకోవాల్సిన అవసరంలేదన్నారు. తాను సినిమా బిడ్డనని…. సినిమా వాణ్ణినని తెలిపారు.