నాసా ‘ఆర్టెమిస్-1’ ప్రయోగం మరింత ఆలస్యం కానున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. పలు కారణాలతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 23వ తేదీన మూడోసారి ప్రయోగానికి షెడ్యూల్ ఖరారు చేశారు. అయితే, దీన్ని మరికొద్ది రోజులకు వాయిదా వేయాలని తాజాగా నాసా నిర్ణయించింది.
ప్రయోగ వాహనంలో తలెత్తిన సాంకేతిక, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు మరింత సమయం అవసరమని ఇంజినీర్లు కోరారు. దీంతో ఈ ప్రయోగాన్ని సెప్టెంబరు 27న చేపట్టాలని నాసా నిర్ణయించింది. ఈ మేరకు బ్లాగ్‌లో అప్‌డేట్ ఇచ్చింది. అయితే, మళ్లీ ఏదైనా సమస్య తలెత్తి సెప్టెంబరు 27న ప్రయోగం చేపట్టడం సాధ్యంకాకపోతే.. మళ్లీ అక్టోబరు 2న లాంఛ్ విండో అందుబాటులో ఉంది.
చంద్రుడిపై శాశ్వత నివాసానికి పునాదులు వేసే ప్రయత్నాల్లో భాగంగా నాసా ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. అయితే, ప్రస్తుతం మాత్రం అందులో ఉన్న ఓరియన్ క్యాప్సూల్ మానవరహితంగానే చంద్రుడి కక్ష్యలోకి వెళ్లి రానుంది. 2024లో ఆర్టెమిస్-2, 2025లో ఆర్టెమిస్-3 ప్రయోగాలను నాసా చేపట్టనుంది.