తెలంగాణ అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన అనంతరం ఆయనను పోలీసు వాహనంలో బలవంతంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఈటల పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బానిసలా తనను ట్రీట్ చేయొద్దంటూ మండిపడ్డారు.
అనంతరం ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘‘మీ నాశనానికే ఇదంతా చేస్తున్నారు.. ఏడాది కాలంగా నాపై కుట్ర చేస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటివరకు అసెంబ్లీకి రాకుండా చేస్తున్నారు. గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది. కేసీఆర్‌ను గద్దె దించే వరకు విశ్రమించను. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు.’’’ అని ఈటల అన్నారు.
శాసనసభ నుంచి భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయన్ను సస్పెండ్ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ పోచారం స్పందిస్తూ ఈటలను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.