ఆ ప్ర‌య‌త్నాల‌ను భారత్‌ అంగీకరించదు

దేశ సరిహద్దుల్లో ఎలాంటి అనూహ్య పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో చైనా నుంచి భారత్‌ ఒక సవాలును ఎదుర్కొంటోందని తెలిపారు. వాస్తవాధీన రేఖను మార్చేందుకు చైనా చేస్తున్న ఏకపక్ష ప్రయత్నాలు భారత్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదన్న విషయాన్ని ఆ దేశానికి చాలా స్పష్టంగా చెప్పామని లోక్‌సభకు వివరించారు.

సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనే విషయంలో భారత సైనిక దళాల శక్తి, సామర్ధ్యాలను సభ సంపూర్ణంగా విశ్వసించాలన్నారు. ‘ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో, సంక్లిష్ట పర్వత శిఖరాలపై దేశమాత రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తున్న మన సాయుధ దళాలను ప్రోత్సహించేలా, వారిలో స్ఫూర్తి నింపేలా సభ ఒక తీర్మానం చేయాలి’ అని రాజ్‌నాథ్‌ విజ్ఞప్తి చేశారు.