జమ్మూకశ్మీర్‌లో ఇవాళ్టి నుంచి జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశమే లక్ష్యంగా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు 26/11 తరహా దాడులకు పన్నాగం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అత్యవసరంగా భద్రతాపరమైన మార్పులు చేశారు.
ఇవాళ్టి నుంచి 24 వరకు ఈ సదస్సు జరగనుంది. తనిఖీల్లో భాగంగా అనుమానం వచ్చి ఐఎస్‌ఐ ఉగ్రవాదుల కోసం పని చేస్తున్న ఓ వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకొని ప్రశ్నించాయి. అతడు సదస్సు నిర్వహించనున్న కన్వెన్షన్ సెంటర్‌లోనే ఉద్యోగం చేస్తున్నాడు. అతడు చెప్పిన వివరాలనుబట్టి ఉగ్రవాదులు భారీ దాడులకు పాల్పడేందుకు అవకాశం ఉన్నట్లు తెలుసుకున్న బలగాలు ఆగమేఘాల మీద భద్రతాచర్యల్లో మార్పులు చేపట్టాయి.
ముంబయి దాడుల తరహాలో కొందరు ఉగ్రవాదులు సదస్సు జరిగే ప్రాంతంలోకి చొరబడి కాల్పులు జరిపేందుకు పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో గుల్‌మార్గ్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కశ్మీర్ లోయలో ఎలాంటి వదంతులు చెలరేగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొబైల్ నెట్‌వర్కులను నిశితంగా పరిశీలిస్తూ అంతర్జాతీయ కాల్స్‌పై దృష్టి పెట్టారు.