డంపర్‌ను ఓ కారు ఢీ కొట్టిన ఘటనలో మంటలు చెలరేగడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. ఈ దారుణ ప్రమాదం శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఉత్తర్‌ప్రదేశ్ బరేలీలో చోటుచేసుకుంది. మృతుల్లో ఓ చిన్నారి సైతం ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచాారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహేడీ ప్రాంతానికి చెందిన కొందరు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. బరేలీ- నైనీతాల్ రహదారిపై వెళ్తున్న సమయంలో వారి కారు టైరు పేలిపోయింది. ఈ క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి మరో లేన్‌లోకి వెళ్లి ఎదురుగా వస్తున్న డంపర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదేసమయంలో కారు డోర్ లాక్ అయిపోవడంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారు. ఈ ఘటనలో అందులో ఉన్న ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. ‘ఢీకొట్టిన తర్వాత కారును డంపర్ కొద్దిదూరం ఈడ్చుకెళ్లడం వల్ల మంటలు చెలరేగాయని పోలీసులు తెలిపారు.