ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేసిన తండ్రి..

ఒడిశా సుందరగఢ్ జిల్లాలో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది.కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే కాల యముడు గా మారాడు.అభం శుభం తెలియని ముగ్గురు పిల్లలను చంపి బావిలో పడేశాడు.జిల్లాలోని కోయిడా పోలీస్ స్టేషన్ పరిది, కులు గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.నిందితుడు పాండు ముందాగా గుర్తించారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..పాండు శనివారం రాత్రి తీవ్రంగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో భార్య ధుబలి ముందాతో గొడవకు దిగాడు.

ఆగ్రహంతో గొడ్డలితో దాడి చేసేందుకు ప్రయత్నించగా ఆమె ఇంటి నుంచి పారిపోయి ప్రాణాలు కాపాడుకుంది.దీంతో ఇంట్లోనే ఉన్న ఐదేళ్ల కూతురు సిమా, రెండేళ్ల కుమారుడు రాజు, మూడు నెలల పాపను చంపాడు.వారి మృతదేహాలను ఇంటి సమీపంలోని బావిలో పడేసి పారిపోయాడు.ఆదివారం ఉదయం పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు.అగ్నిమాపక సిబ్బంది తో పాటు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..మృతదేహాలను బావి నుంచి తీసి పోస్టుమార్టం కి తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.