ఎన్నికల అనంతరం ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దానికి బయటి నుంచి మద్దతిస్తానని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరి స్పందించారు. ఆమె కూటమిని ఏనాడో విడిచిపెట్టారని తెలిపారు. దీదీ చేసిన వ్యాఖ్యలు నమ్మశక్యంగా లేవని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీని గద్దె దించేందుకు ప్రతిపక్ష కూటమి ముందుకు సాగుతోందని అన్నారు.
మమతా బెనర్జీ కూటమి లోపల లేదా బయట ఉండి ఏం చేస్తారో తెలియదని అధీర్ వ్యాఖ్యానించారు. దీనిపై ఆమె స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మమతా పూర్తిగా కూటమిని విడిచి బీజేపీతో జత కట్టే అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదన్న ఆయన.. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు కూడా గెలుచుకోవడం కష్టమని బీజేపీ చెబుతోందని కానీ, మమతా మాత్రం ఇండియా కూటమి అధికారంలోకి రావడం గురించి మాట్లాడుతున్నారని తెలిపారు. బీజేపీ ఓడిపోతుందని గ్రహించి ఈ వ్యాఖ్యలు చేశారని అధీర్ రంజన్ ఆరోపించారు.