వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్ ఎక్కువగా వ్యాపిస్తోంది. ఇక డెంగీ కేసులు కూడా విజృంభిస్తున్నాయి. దోమల నివారణకు స్థానిక యంత్రాంగాలు చర్యలు తీసుకొంటున్నా డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ సమస్య ముంబయి వంటి మహానగరాల్లోనూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దోమల నివారణకు ఓ పరిష్కారాన్ని సూచించారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండ ఆనంద్ మహీంద్రా తాజాగా దోమలకు చెక్ పెట్టేందుకు ఓ వీడియో షేర్ చేశారు. “చిన్న సైజు లేజర్ ఆధారిత క్యానన్ లాంటి ఈ పరికరాన్ని చైనీస్ ఇంజినీరు అభివృద్ధి చేశారు. నేనూ ఈ క్యానన్ కొనుగోలుకు ప్రయత్నిస్తున్నా. ఈ పరికరం మీ ఇంటికి ఐరన్‌డోమ్ లాంటిది’’ అని ఓ వీడియో షేర్ చేసి క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ పరికరంలో అమర్చిన రాడార్ వ్యవస్థ చుట్టూ ఉన్న దోమలను వేగంగా గుర్తించగా.. లేజర్ పాయింటర్ వాటిని చంపేస్తుంది.