దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌ను కలవనున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి పవార్‌తో భేటీ కానున్నారు. దిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా తిరుగుతున్న విషయం తెలిసిందే. దీని కోసమే కేజ్రివాల్ ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరారు. ఇదే విషయంపై ఇవాళ పవార్‌తో సమావేశమై మద్దతు కోరనున్నారు.
దిల్లీలో అధికారుల పోస్టింగ్‌లు, బదిలీల విషయంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ)కు సర్వాధికారాలు కట్టబెడుతూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ఆప్ సర్కార్ పోరుబాటకు సిద్ధమైన సంగతి విదితమే. ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ‘నల్ల ఆర్డినెన్స్’కు వ్యతిరేకంగా జూన్ 11న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మహా ర్యాలీ చేపడుతామని ఆప్ ఇప్పటికే ప్రకటించింది.