ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం త్రిపుర, నాగాలాండ్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఉదయం 9.45 గంటల వరకు వెలువడిన ఓట్ల లెక్కింపు ఫలితాలు ఇలా ఉన్నాయి.
త్రిపురలో బీజేపీ కూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్- వామపక్షాల కూటమి 19 చోట్ల ముందంజలో ఉంది. టీఎంపీ (తిప్రా మోథ్రా పార్టీ) 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్డీపీపీ కూటమి స్పష్టమైన ఆధిక్యం సంపాదించింది. ఇప్పటి వరకు ఈ కూటమి ఒక చోట విజయం సాధించగా.. మరో 48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్పీఎఫ్ 6, కాంగ్రెస్ 1, ఎన్పీపీ 3, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.
మరోవైపు మేఘాలయలో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు లెక్కించిన ఓట్లను పరిశీలిస్తే మేఘాలయలో ఇప్పటి వరకు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. ఇక్కడ సీఎం కాన్రాడ్ సంగ్మా సారథ్యంలోని ఎన్పీపీ 15, తృణమూల్ కాంగ్రెస్ 15 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ఇతరులు 16 స్థానాల్లో, బీజేపీ 6, కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.