ప్ర‌యివేటీక‌రించ‌డ‌మేనా దేశ‌భ‌క్తి అంటే?

-

  • ప్ర‌జ‌ల‌ను మోస‌గించారు.. ఇది ప్ర‌జా వ్య‌తిరేక బ‌డ్జెట్
  • బీజేపీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫైర్ 

న్యూఢిల్లీ : సోమ‌వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ లోక్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన  “కేంద్ర బ‌డ్జెట్ 2021-2022” ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం లక్ష్యంగా ఉంద‌నీ, ఇది ప్ర‌జా వ్య‌తిరేక బ‌డ్జెట్ అంటూ ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమ‌తా బెన‌ర్జీ కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు గుప్పించారు. ప్ర‌జా సంక్షేమమంటూ కేంద్ర బడ్జెట్ ను అమలు చేస్తున్నామనీ, జాతీయవాదం, దేశ‌భ‌క్తి గురించి గొంతు చించుకునే బీజేపీ ఆచరణలో మాత్రం దేశ వనరులను ప్ర‌యివేటు వ్యక్తులకు అమ్ముతున్నార‌ని విమ‌ర్శించారు. ఇదేనా దేశ‌భ‌క్తి అంటే? అని ప్ర‌శ్నించారు.

అలాగే, కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను సైతం ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయ‌ల ఎన్‌పీఏల‌ను ర‌ద్దు చేయ‌గ‌లిగిన ప్ర‌భుత్వం.. రైతు రుణాల‌ను ఎందుకు మాఫీ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. “వారు (బిజెపి) దేశ‌భ‌క్తిపై ఉప‌న్యాసాలు ఇస్తారు కానీ ఆచరణలో మాత్రం దేశాన్ని అమ్మెస్తున్నారు. పీఎస్ యూలు, ఇన్సూరెన్స్, రైల్వేస్ నుంచి పోర్టుల వరకు అన్నింటినీ ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు అమ్ముతున్నారు. ఈ బ‌డ్జెట్ ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డానికే. ఇది రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక బడ్జెట్” అని మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు.

అగ్రి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సెస్ గురించి మాట్లాడుతూ, ఇప్పుడు కొత్త సెస్ ను అమలు చేస్తున్నారు. సెస్ ద్వారా వచ్చే ఆదాయాలను కేంద్రం తీసుకోగా, రాష్ట్రాల తో పంచుకోలేద‌ని అన్నారు. అలాగే, పెట్రోల్, డీజిల్ ధరలను క్రమం తప్పకుండా పెంచడం, నిత్యావసర వస్తువుల ధరల పెంపు కారణంగా పేద ప్రజలపై సెస్ విధించడం తీవ్ర ప్రభావం చూపిందని ఆమె అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news