గత కొన్ని రోజుల నుంచి అంతర్జాతీయ నంబర్ల నుంచి వాట్సాప్‌లో స్పామ్ కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై వాట్సాప్ యూజర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యవహారంపై త్వరలోనే వాట్సాప్ సంస్థకు నోటీసులు పంపనున్నట్లు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. డిజిటల్ వేదికలపై వినియోగదారుల భద్రతకు సదరు కంపెనీలే బాధ్యత వహించాలని సూచించారు. గోప్యతకు భంగం వాటిల్లిన ప్రతి ఉదంతంపైనా కేంద్రం స్పందిస్తుందని స్పష్టం చేశారు.
యూజర్ల భద్రత, గోప్యతకు భంగం కలగకుండా డిజిటల్ వేదికలే బాధ్యత వహించాలని స్పష్టమైన సందేశాల్ని పంపుతున్నట్టు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. వాట్సాప్ డాటాబేస్‌లో ఏదైనా లోపం ఉం దా? స్పాం కాల్స్ వెళ్లిన వాట్సాప్ నంబర్లపై పరిశీలన జరుపుతున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, కెన్యా, ఇథియోపియా దేశాల నుంచి తమకు వాట్సాప్‌లో స్పాం కాల్స్ వస్తున్నాయని అనేకమంది గతకొద్ది రోజులుగా ట్విట్టర్లో ఫిర్యాదు చేస్తున్నారు.