నమీబియా నుంచి మధ్యప్రదేశ్ కునో పార్కుకు తీసుకువచ్చిన చీతాలకు ఏం జరిగిన తమదే బాధ్యత అని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. చీతాల ప్రాజెక్టు విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. చీతాల వరుస మరణాలతో ప్రాజెక్టు సఫలతపై అనుమానాలు వ్యక్తమవుతుండటంతో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు కునో జాతీయ పార్కుకి తీసుకొచ్చిన చీతాల కోసం అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా కంచెలు నిర్మించబోమని ప్రభుత్వ కమిటీ ఛైర్మన్ రాజేశ్ గోపాల్ స్పష్టం చేశారు. అటవీ జంతువుల సంరక్షణ ప్రాథమిక నిబంధనలకు ఇది విరుద్ధమని తెలిపారు. కునో పార్కులో ఇటీవల వరుసగా మూడు పెద్ద చీతాలు, మరో మూడు చీతా కూనలు మృతి చెందిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా నిపుణుడు విన్సెంట్…కంచె నిర్మాణ సూచన చేశారు. తమ దేశంలో ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు. చీతాలు సంచరించే ప్రాంతాల్లోకి ఇతర అటవీ జంతువులు, మనుషుల సంచారాన్ని నిరోధించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని విన్సెంట్ వ్యక్తపరిచారు. అయితే, ఇటువంటి కంచెలు అటవీ జంతువుల సహజ సంచారానికి అవరోధంగా నిలుస్తాయని, జంతువుల మధ్య జన్యు మార్పిడికి ఆటంకం కలిగిస్తాయని రాజేశ్ గోపాల్ అన్నారు.