దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా, వినియోగం కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా సరఫరా, వినియోగం జరగకుండా అధికారులు రాత్రింబవళ్లు చర్యలు చేపడుతున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతూ డ్రగ్స్ సరఫరాను కట్టడి చేస్తున్నారు. ముఖ్యంగా విమానాశ్రాయాల్లో అధికారులు డ్రగ్స్ అక్రమ రవాణాపై పటిష్ఠ నిఘా ఉంచారు.
విదేశాల నుంచి రహస్యంగా డ్రగ్స్ సరఫరా చేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. తాజాగా అధికారుల తనిఖీలో ముంబయి ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. విదేశాల నుంచి రహస్యంగా భారత్‌కు కొకైన్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ముంబయి డైరెక్టెరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు డ్రగ్స్ స్మగ్లింగ్ గురించి నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ముంబయి ఎయిర్‌పోర్టులో అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అనుమానంగా కనిపించిన ఓ వ్యక్తిని తనిఖీ చేయగా అతడు సబ్బు డబ్బాల్లో కొకైన్ నింపి తరలిస్తుండటం పట్టుబడింది. మొత్తం 2.58 కిలోల బరువున్న రూ.25 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు సీజ్ చేశారు.