వాస్తవానికి ప్రశాంత్ కిశోర్ ఎప్పుడో కాంగ్రెస్ లో చేరాల్సిన వారే ! కానీ ఎందుకనో మధ్యలో కొంత అగాధం ఏర్పడింది. ఆయనకూ మరియు అధినేత్రికీ మధ్య ఏర్పడిన అగాధం పూడ్చేందుకు కొందరు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఆఖరికి ఆయన కోరుకున్న విధంగా లేదా ఆయన ప్రతిపాదించిన విధంగా కాంగ్రెస్ అధినాయకత్వం అయితే నడుచుకునేందుకు సిద్ధంగా ఉంది. ఆ మేరకు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ, కొన్ని రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన మాట నెగ్గే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి. ఈ దశలో ఆయనేం చెబుతారు అన్నది కీలకం. విభిన్న వాదాలకు ఆనవాలుగా ఉండే కాంగ్రెస్ లో ఆయన మాట చెల్లుబాటు అవుతుందా అన్నది మరో ఆసక్తికర చర్చ.
ముఖ్యంగా పీకే స్ట్రాటజీ ప్రకారం వెళ్లే అవకాశాలే ఉంటే కొన్ని విరుద్ధ చర్యలకు కాంగ్రెస్ ఒప్పుకుని తీరాలి. ముఖ్యంగా ఆయన ద్వేష సంబంధ రాజకీయాలకు తెరలేపుతుంటారు. లేదంటే ఫేక్ అకౌంట్లతో సోషల్ మీడియా లో డ్రామా నడుపుతారు. ఇదీ వర్కౌట్ అవ్వలేదని తెలియగానే ముందుగానే అప్రమత్తమై సానుభూతి రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చి నాలుగు ఓట్లు ఎలా దండుకోవాలి ఇది వరకే నిరూపించారు కూడా ! అదే పని ఇప్పుడూ చేయనున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఓ ప్రధాన పార్టీకి సలహాదారుగా ఉన్నప్పుడు కొన్ని తిక్క సలహాలు కూడా ఇచ్చారాయన. అలాంటివే ఇప్పుడూ ఇస్తే వాటినే ప్రామాణికం అనుకుని అధినేత్రి కనుక పనిచేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది.