ఉపిరి పీల్చుకుంటున్న దేశ రాజధాని

దాదాపు గత మూడు నెలలుగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశ రాజధాని ఢిల్లీ గడగడలాడుతోంది. రోజుకు వేలల్లో కేసులు వందల్లో మరణాలతో ఢిల్లీ ప్రజలు వణికిపోయారు. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు చాలా రోజులు ఢిల్లీ లాక్‌డౌన్ లోనే ఉండిపోయింది. అయితే ఇన్ని రోజులు కరోనాతో వణికిపోయిన ఢిల్లీ ఇప్పుడిప్పుడే ఉపిరి పీల్చుకుంటుంది. ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

శనివారం ఢిల్లీలో 414 కేసులు నమోదవగా తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో ఢిల్లీలో కేవ‌లం 381 కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయి. మొత్తం 34 మంది మృత్యువాత ప‌డ్డారు. అయితే మార్చి 9వ తేదీ త‌ర్వాత ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఇంత త‌క్కువ‌గా రావ‌డం ఇదే తొలిసారి. అంటే దాదాపు మూడు నెలల తర్వాత ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య కనిష్టానికి చేరింది.

ఢిల్లీలో ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం టెస్టుల సంఖ్య 1,97,58,315గా ఉండగా… ప్ర‌స్తుతం ఢిల్లీలో 5889 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు కూడా 0.5 శాతానికి ప‌డిపోవడం మరింత ఊరట నిచ్చే విషయం. ఇక ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో క్రమంగా ఆంక్షలు కూడా సడలిస్తున్నారు.