భారత్ లో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ మహమ్మారి యాక్టివ్ గా మారుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో ఈ వైరస్ మరోసారి బుసలుకొడుతోంది. ఒక్కరోజులోనే 300 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
దేశంలో హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో దిల్లీలో గత కొన్ని రోజులుగా రోజువారీ కొవిడ్‌కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఒక్కరోజే 300 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. తాజా కేసులతో కలిపితే దిల్లీలో ఇప్పటివరకు నమోదైన కొవిడ్ కేసుల సంఖ్య 20,09,361కి పెరిగింది.
మరోవైపు, రోజువారీ పాజిటివిటీ రేటు 13.89శాతానికి పెరిగినట్టు దిల్లీ ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా కొవిడ్ బారినపడి మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. దిల్లీలో గత కొన్ని రోజులుగా కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం 115 కొత్త కేసులు నమోదు కాగా.. నిన్న 214 కేసులు, తాజాగా ఆ సంఖ్య 300లకు పెరిగింది.