ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ పథకం సమాచార హక్కును హరిస్తుందని పేర్కొంది. ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగీవ్ర తీర్పును ఇచ్చింది.
ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమే. నల్లధనాన్ని అరికట్టాలనే కారణంతో సమాచార చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదు. సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏక పక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్- ప్రో -కో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటం వల్ల పారదర్శకత లోపించింది. అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందే. అని సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.