కరోనా టీకా మొదటి డోసు తాత్కాలికంగా నిలిపివేత

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా టీకా మొదటి డోసును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం నుంచి కేవలం రెండో డోసు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపింది. మే 15 వరకు కరోనా టీకా మొదటి డోసు నిలిపివేయాలని నిర్ణయించింది. కాగా రాష్ట్రంలో రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నారని వైద్య ఆరోగ్య వెల్లడించింది.

 

అయితే వ్యాక్సిన్‌ కొరత ఏర్పడడంతో మొదటి డోసు ఇలానే ఇస్తూ పోతే రెండో డోసు వేసుకోవాల్సిన వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేవలం రెండో డోసు మాత్రమే వేయాలని.. తొలి డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.కాగా తెలంగాణ రాష్ట్రానికి 30 లక్షల కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే రాష్ట్రానికి కేవలం 15 నుంచి 16 లక్షల డోసులు మాత్రమే వచ్చినట్లు సమాచారం. కాగా తెలంగాణలో డోసుల కొరత కారణంగా ఇటీవలే పలుమార్లు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిలిపివేసిన సంగతి తెల్సిందే.