భారత్లో జరగనున్న ప్రపంచంలోని అతిపెద్ద ఎన్నికలను జర్మనీ ఆసక్తిగా గమనిస్తోందని ఆ దేశ రాయబారి ఫిలిప్ అకెర్‌మాన్ అన్నారు. ఈ ప్రక్రియను తాము గౌరవిస్తామని చెప్పారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రభావం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. జీ-20 సదస్సుకు న్యూదిల్లీ ఆతిథ్యమిచ్చినప్పుడే ఆ విషయం అర్థమైందని తెలిపారు.
ప్రస్తుతం భారత్ ఎంత వేగంగా ఎదుగుతోందో ప్రపంచమంతా చూస్తోందని ఈ సందర్భంగా ఫిలిప్ అకెర్ మాన్ అన్నారు. ఇక్కడ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న ఎన్నికలను తాము ఉత్సుకతతో గమనిస్తున్నామని తెలిపారు. ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగగా అభివర్ణించిన ఫిలిప్… భవిష్యత్తులో అంతర్జాతీయ వేదికపై న్యూదిల్లీ ముద్ర మరింత స్పష్టంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించిందని ఫిలిప్ గుర్తు చేశారు. ఈ సదస్సుకు సంబంధించి మొత్తం 28 రాష్ట్రాలు, 8కేంద్ర పాలిత ప్రాంతాలు, 60 నగరాల్లో రెండు వందలకు అనుబంధ సమావేశాలు ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రపపంచ దేశాల్లో కేవలం భారత్‌కు మాత్రమే ఇది సాధ్యమని కొనియాడారు.