పశ్చిమ బెంగాల్ అలీపుర్‌దూర్ జిల్లాలోని రాజభట్ ఖావా వద్ద విషాదం చోటుచేసుకుంది. గూడ్స్ రైలు ఢీకొని మూడు ఏనుగులు దుర్మరణం చెందాయి. అలీపుర్‌దూర్ నుంచి సిలిగురికి వెళ్తున్న గూడ్స్ రైలుకు ఏనుగుల గుంపు హఠాత్తుగా అడ్డం వచ్చింది. ఈ క్రమంలో రైలు వాటిని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ ఏనుగు పిల్లతో సహా రెండు పెద్ద ఏనుగులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైల్వే, అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని… విచారణ చేపట్టారు.
విచారణలో భాగంగా పశ్చిమ బెంగాల్ అటవీ శాఖ అధికారులు ఏనుగులను ఢీ కొట్టిన గూడ్స్ రైలును సీజ్ చేశారు. ఈ జప్తు సాంకేతికమైనదని.. తాము రైలును భౌతికంగా స్వాధీనపరచుకోలేదని తెలిపారు. ప్రమాదస్థలిలోనే రైలు ఉందని.. కాగితాలపై ప్రక్రియ పూర్తి చేశామని అటవీశాఖ చీఫ్ వార్డెన్ దేబల్‌రాయ్ వెల్లడించారు. పట్టాలపైకి ఏమైనా అడ్డంగా వస్తే గుర్తించి అప్రమత్తం చేసే ఐడీఎస్ ఈ మార్గంలో లేదని… ఐడీఎస్ ఉన్నచోట ఏనుగులను రైళ్లు ఢీకొన్న ఘటనలు లేవని రైల్వే అధికారులు తెలిపారు.