బిహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారణ్ జిల్లా మోతిహరిలో ఓ విచిత్ర ఘటన జరిగింది. వివాహ వేడుకల్లో భాగంగా అప్పగింతలు జరుగుతున్న క్రమంలో.. తమ కూతురికి అత్త వారింట్లో ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని పేపర్ మీద రాసి హామీ ఇవ్వాలని వధువు తల్లిదండ్రులు కోరారు. ఇదేం వింత డిమాండ్ అని కోపం తెచ్చుకున్న వరుడు.. అలాగే రాసిస్తామని కానీ తమకు కూడా ఓ డిమాండ్ ఉందని అత్తామామల ముందు తన షరతు పెట్టాడు. వరుడి షరతు విన్న వారంతా షాక్ అయ్యారు.
మోతిహరికి చెందిన వధూవరులకు నవంబరు 16న ఘనంగా వివాహం జరిగింది. అప్పగింతల సమయంలో వధువు, వరుడికి మధ్య గొడవ జరిగింది. వధువు తల్లిదండ్రులు.. తమ కుమార్తెకు అత్తవారింట్లో ఎలాంటి ఇబ్బంది రాదని పేపర్ మీద రాసి హామీ ఇవ్వాలని కోరారు. కోపోద్రిక్తుడిన వరుడు.. వధువు కన్యత్వ పరీక్ష చేయించుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో వధువు కుటుంబీకులు.. వరుడి బంధువులను బంధించారు. అనంతరం పోలీసుల చొరవతో రెండు రోజుల తర్వాత వారిని విడుదల చేశారు. అయితే వధువు.. పెళ్లి కుమారుడితో అత్తవారి ఇంటికి వెళ్లకపోవడం గమనార్హం.