మోర్బీ బాధితుల పరిహారంపై గుజరాత్ హైకోర్టు అసంతృప్తి

గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనలో బాధితులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై గుజరాత్ హైకోర్టు అంసతృప్తి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబీకులకు ప్రకటించిన పరిహారం చాలా తక్కువని వ్యాఖ్యానించింది. తీవ్రంగా గాయపడిన వారికి కూడా అతి తక్కువ పరిహారాన్ని ప్రకటించడాన్ని తప్పుబట్టింది.

‘‘బాధితులకు, వారి కుటుంబీలకు మీరు అందించే పరిహారం వాస్తవికంగా ఉండాలి. ఈ సమయంలో వారికి గౌరవప్రదమైన పరిహారం అందించడం ఎంతో అవసరం. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు నెలకు ₹ 3,000 సాయం చాలా తక్కువ. అవి వారి దుస్తులు, పుస్తకాలకే సరిపోవు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

 

ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోగా, 12 మంది పిల్లల తల్లిదండ్రుల్లో ఒకరు మరణించారు. వీరికి ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పరిహారాన్ని రెండింతలు చేయాలి లేదా ఒక్కొక్కరికి కనీసం ₹ 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బాధితులకు అందించే పరిహారానికి సంబంధించి వివరణతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని గుజరాత్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిహారం అందించేందుకు అనుసరిస్తున్న విధివిధానాలను కోర్టుకు సమర్పించాలని సూచించింది.  రాష్ట్రంలోని బ్రిడ్జిల పరిస్థితిపై సర్వే నిర్వహించి, ఆ నివేదికను ధర్మాసనం ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.