ఈపీఎఫ్‌వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు, కార్మికులకు అధిక పింఛన్ దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అధిక పింఛన్‌కు 18 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2014 సెప్టెంబరు 1కి ముందు సర్వీసులో చేరి.. ఈపీఎఫ్‌వో గరిష్ఠ వేతన పరిమితికి మించి వేతనం పొందుతూ ఆ మేరకు ఈపీఎఫ్ చందా చెల్లిస్తున్న ఉద్యోగుల నుంచి ఈపీఎఫ్‌వో ఆన్‌లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తోంది.
అధిక పింఛనుకు ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు నాలుగు నెలల గడువు ఇవ్వాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ గడువు ముగియనుండటంతో మరోసారి పొడిగించే అవకాశాల్లేవని ఈపీఎఫ్‌వో వర్గాలు పేర్కొంటున్నాయి. దరఖాస్తులకు మంగళవారం చివరి రోజు కావడంతో.. సోమవారం కార్యాలయాల్లో అధికారులు అధిక పింఛను దరఖాస్తు సేవలందించడంతో పాటు చందాదారులకు సందేహాలు నివృత్తి చేయాలని నిర్ణయించారు.
అధిక పింఛనుకు అర్హత కలిగిన చందాదారులకు, దరఖాస్తు చేసేందుకు ప్రయత్నించి విఫలమైన వారికి ఈపీఎఫ్‌వో ప్రాంతీయ కార్యాలయాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇందుకోసం ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశారు. సెలవు రోజుల్లోనూ చందాదారులకు సిబ్బంది ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు.