అగ్నిప‌థ్ : ఎంత మందిని ముంచేశావ్ సుబ్బారావ్ !

ఇప్ప‌టిదాకా అగ్నిప‌థ్-కు సంబంధించి అనేక వివరాలు వ‌స్తున్నాయి. వాటిలో ఉన్న నిజానిజాలు వివ‌రించేందుకు త్రివిధ ద‌ళాధిప‌తులు ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఇవ‌న్నీ అర్థం చేసుకోవ‌డం, సైన్యంలో చేర‌డం లేదా చేరక‌పోవ‌డం అన్న‌వి ఎవ‌రికి వారు చేయాల్సిన ప‌నులు. అగ్నిప‌థ్ మంచి ప‌థ‌కమా లేదా చెడ్డ ప‌థ‌క‌మా అన్న‌ది కాదు కానీ ఓ స్వార్థ శ‌క్తి కార‌ణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ల‌లో అల్ల‌ర్లు జ‌రిగి, 30 కోట్ల‌కు పైగా ఆస్తిన‌ష్టం జ‌ర‌గ‌డం, ఒక నిండు ప్రాణం పోవ‌డం అన్న‌వే అత్యంత విషాదక‌రం. అగ్నిప‌థ్ గురించి సాయి డిఫెన్స్ అకాడ‌మీ చైర్మ‌న్ ఆవుల సుబ్బారావు త‌న ద‌గ్గ‌ర ఉన్న శిక్ష‌ణార్థుల‌ను రెచ్చ‌గొట్టి, ప్ర‌భుత్వాస్తుల‌ను ద‌గ్గ‌రుండి ధ్వంసం చేయించారన్న ఆరోప‌ణ‌లే ఇప్పుడు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. పోలీసుల విచార‌ణ‌లో కూడా ఇవే వినిపిస్తున్నాయి. నిర్థారితం అవుతున్నాయి కూడా ! నిన్న‌టివేళ మ‌రో నిందితుడు పృధ్విరాజ్ ను పోలీసులు అరెస్టు చేశాక ఈ కేసు ద‌ర్యాప్తు మ‌రింత ముందుకు వెళ్ల‌నుంది అని తెలుస్తోంది.మ‌రికొంద‌రిని కూడా అదుపులోకి తీసుకుని విచారించాల‌ని పోలీసులు యోచిస్తున్నారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో జ‌రిగిన విధ్వంస కాండకు సంబంధించి మ‌రికొన్ని వాస్త‌వాలు వెలుగు చూస్తున్నాయి.  ఈ కేసులో సాయి డిఫెన్స్ అకాడ‌మీ చైర్మ‌న్ ఆవుల సుబ్బారావును పోలీసులు ఇప్ప‌టికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తొలుత ఉమ్మ‌డి గుంటూరు జిల్లా, న‌ర‌స‌రావుపేట‌లో పోలీసులు ఆయ‌న్ను విచారించారు. అక్క‌డ స్థానిక అధికార పార్టీ నాయ‌కుల ఒత్తిళ్ల కార‌ణంగా తెలంగాణ పోలీసుల‌కు కొన్ని స‌వాళ్లు ఎదురయ్యాయి. దీంతో ఆయ‌న్ను రైల్వే పోలీసుల‌కు అప్ప‌గించార‌ని స‌మాచారం. ఇవి ఇలా ఉంటే.. సుబ్బారావు త‌న డిఫెన్స్ అకాడ‌మీల‌ను కాపాడుకునేందుకే ఏకంగా ప‌ది కి పైగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి విద్యార్థులను రెచ్చ‌గొట్టాడ‌ని తెలుస్తోంది. ఆర్మీ ర్యాలీల‌కు సంబంధించి ఇప్ప‌టికే ఫిట్నెస్ టెస్టు పూర్త‌యినా రాత పరీక్ష కు సంబంధించి ఎటువంటి  క్లారిఫికేష‌న్ రాలేదు.

కానీ ఉన్న‌ట్టుండి పాత నోటిఫికేష‌న్లు అన్నీ ర‌ద్దు చేసి అగ్నిప‌థ్ పేరిట కొత్త‌గా నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని కేంద్రం చెప్ప‌డంతో ఎక్క‌డ త‌న సంస్థ‌ల ఉనికికి ఇబ్బంది వ‌స్తుందోన‌ని ఆయ‌నీ విధంగా అభ్య‌ర్థుల‌ను రెచ్చ‌గొట్టారు అని పోలీసుల విచార‌ణ‌లో  తేలింది . వాస్త‌వానికి ఈయ‌న ద‌గ్గ‌ర వంద‌ల సంఖ్యలో శిక్ష‌ణార్థులు ఉన్నారు. ఒక్కో అభ్య‌ర్థి నుంచి రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు వ‌సూలు చేసి ఆర్మీలో మీకు జాబ్ గ్యారంటీ అని చెప్పి, ఫీజు పిండుతారు. టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్టును, ఇత‌ర ప‌త్రాల‌ను కూడా త‌న వ‌ద్దే ఉంచుకుని, ముందు కొంత మొత్తం చెల్లించ‌మ‌ని చెబుతారు. జాబ్ వ‌చ్చాక మిగ‌తా మొత్తం చెల్లించ‌మ‌ని ముందే నిబంధ‌న విధిస్తారు. ఆ విధంగా ఆయ‌న అడ్మిష‌న్లు పొంది ఉన్నార‌ని, కానీ తాజా నోటిఫికేష‌న్ ప్ర‌భావంతో ఎక్క‌డిక్క‌డ‌క త‌నకు రావాల్సిన డ‌బ్బులు రాకుండా పోతాయి అన్న భ‌యంతో ఈ విధంగా ఆయ‌న విధ్వంసాల‌కు తెర‌లేపార‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే సుబ్బారావు త‌న ద‌గ్గ‌ర ఉన్న శిక్ష‌ణార్థుల‌ను భ‌యాందోళ‌న‌ల‌కు గురిచేసి, అల్ల‌ర్ల‌కు కార‌ణం అయ్యాడ‌న్న అభిప్రాయాలు విన వ‌స్తున్నాయి. కొంద‌రిని ఇంట్రాగేట్ చేశాక కూడా ఇవే నిజాలు వెలుగు చూశాయి కూడా ! దీంతో సుబ్బారావు ను మ‌రియు అత‌డి శిక్ష‌ణార్థుల‌ను మ‌రింత లోతుగా విచారించేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు.