నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్‌వర్క్ కింద కేంద్ర విద్యాశాఖ దేశంలోని అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాను ఇవాళ విడుదల చేసింది. ఈ ఏడాది కూడా ఐఐటీ మద్రాస్ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. దేశంలో అత్యుత్తమ ఉన్నత విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ వరుసగా ఐదో ఏడాది మొదటి స్థానాన్ని నిలిచింది. ఉత్తమ విశ్వవిద్యాలయాల విభాగంలో ఐఐఎస్‌సీ బెంగళూరు మొదటి స్థానాన్ని సంపాదించింది.
మొత్తం ఉన్నత విద్యాసంస్థల్లో ఐఐఎస్‌సీ రెండో స్థానంలో, ఐఐటీ దిల్లీ మూడో స్థానంలో నిలిచింది. ఐఐటీ మద్రాస్ అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో వరుసగా ఎనిమిదో సారి అగ్రస్థానం సంపాదించింది. ఆ తరువాతి స్థానాల్లో ఐఐటీ దిల్లీ, ఐఐటీ బాంబే నిలిచాయి. పరిశోధన విభాగంలో ఐఐఎసీ బెంగళూరు ఉత్తమమైన సంస్థగా నిలిచింది. ఐఐటీ కాన్పూర్ ఆవిష్కరణకు అత్యుత్తమ ర్యాంక్‌ను సంపాదించుకుంది. ఫార్మసీ రంగంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్.. మొదటి స్థానం సంపాదించింది. ఫార్మాలో.. జామియా హమ్దార్ద్, బిట్స్ పిలానీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.